Pranay and the nomadic human brains - Diaries of Karthik

Pranay and the Nomadic human brains (Telugu)

Pranay and the nomadic human brains - Diaries of Karthik

మనిషి పుట్టుక పుట్టినందుకు సగటున నేను బతికే అవకాశం ఉన్న యాభై సంవత్సరాలూ నాకు నచ్చింది చేసుకుంటూ బతికేయాలి అనుకునే వ్యక్తిని నేను. నాకంటూ ఒక చట్రం గీసుకుని, సాధ్యమైనంత వరకూ సమాజంతో సంబంధం లేకుండా బతికేస్తూ ఉంటాను. నా చట్రంలో ఉన్నవారికి తప్ప మిగతా ప్రపంచంలో ఎవరికి ఏమి జరిగినా పెద్దగా చలించను, స్పందించను. సాధ్యమైతే, నా మనసొప్పితే కాస్త సాయం చేస్తాను అంతే. కానీ నా చుట్టూ ఉన్న సమాజంలో కులం పేరుతో తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, తన్నుకుంటున్నారు, చంపుకుంటున్నారు. కులం దాటి మతం పేరుతో కూడా అదే చేస్తున్నారు. నా చట్రంలో నేను బతుకుతున్నా కూడా అప్పుడప్పుడు ఇలాంటి విషయాలు నన్నూ కదిలిస్తాయి. మనుషులు ఎందుకు ఇలా ఉంటారు అని అనిపిస్తుంది, చాలా చిరాకుగా కోపంగా ఉంటుంది.

మొన్న ఒక అబ్బాయిని చంపేశారు, బాధ అనిపించింది కానీ ఆ విషయం గురించి నేను ఎక్కువగా పట్టించుకోలేదు. చంపిన వాడిని చెరసాలలో వేశారు. అంతవరకూ బానే ఉంది, కానీ ఆ ఊరిలో అతని కులం వాళ్ళు ఆ హంతకుడికి మద్దతుగా ర్యాలీ చేసారు అంట. అప్పుడు కలిగింది నాలో ఒక ఆలోచన, వాడేదో ఘనకార్యం చేసినట్టు వీళ్ళు ఏంటి అలా మద్దతుగా ర్యాలీ తీసారు? నైతిక విలువలు, మానవతా దృక్పథం ఉన్న మనుషులు ఎవరూ ఒక హంతకుడిని సమర్థించరు కదా? అసలు దీని వెనుక ఏదైనా కారణం ఉందా? అలా వాళ్ళు మద్దతుగా నిలబడటం తప్పా? వాళ్ళ ఆలోచన ఏమి ఉండొచ్చు? ఇలా రకరకాల ప్రశ్నలు.

అప్పుడు తట్టింది ఎప్పుడో నా చిన్నప్పుడు సాంఘికశాస్త్రంలో చదివిన ఒక విషయం. మనుషులు గుహలలో  నివసించే అప్పుడు తెగలుగా ఉండేవారని, తమ తెగ ఎదగడానికి ఎంతకి అయినా తెగించేవారని, ఇతర తెగల వారిని చంపటం వారికి పెద్ద విషయం కాదు అని చదివాను. వారికి కులాలు, మతాలు లేవు (ఉన్నాయేమో ఎవడికి తెలుసు నేను చూశానా?), కేవలం తమ తెగ అనే ఒక భావం ఎంతకైనా తెగించే విధంగా వారిని చేసింది. ఇది దాదాపు రెండు లక్షల సంవత్సరాల క్రితం సంగతి. గత లక్ష సంవత్సరాలలో మనిషి బాగా ఎదిగాడు, కుటుంబ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు, సమాజ జీవనం అలవర్చుకున్నాడు. వివిధ తెగలకు సంబంధించిన మనుషులు అందరూ కలిసి జీవించటం మొదలుపెట్టారు. కానీ మా తెగ మాత్రమే గొప్పది, మా తెగ మాత్రమే బతకాలి అనే భావన మనిషిలో ఉండిపోయింది అనుకుంటా అందుకే కులాలు, మతాలు ఏర్పరచుకున్నాడు అనుకుంటా(నేను దేవుడిని నమ్మను, కులాలను, మతాలను అస్సలు నమ్మను, కావునా ఇవన్ని మనిషి ఏర్పరచుకున్న సరిహద్దులు అని నా నమ్మకం). అందుకే కాబోలు, ఆ హంతకుడు తమ తెగకే చెందివాడు అని వారు మద్దతుగా నిలబడి ఉండొచ్చు.

ఇతర కారణాలు కూడా ఉండొచ్చు కానీ నాకు వచ్చిన ఈ ఆలోచన కాస్త నిజానికి దగ్గరగా ఉంది అనిపించింది. లేకపోతే వివక్షలు, మానవ హక్కులు, కుల – మత ప్రతిపాదక రిజర్వేషన్లు ఇవన్నీ ఎందుకు అసలు? ఇంకా తెగల కాలం నాటి మస్తిష్కంతో ఉన్నామనే ఏమో మరి.

అసలు ఒక తరం పిల్లలని ఈ సమాజానికి, కుల, మత మరే ఇతర భావాలకు దూరంగా తీసుకెళ్ళి జాగ్రత్తగా అడవిలో పెంచితే కానీ ఆ తరువాతి తరం పిల్లలు ఎటువంటి వివక్షలకు గురి అవ్వకుండా ఉంటారేమో?

1 Comment

Join the discussion and tell us your opinion.

Srikanthreply
September 26, 2018 at 10:30 pm

Well said … manushulaki Pranam value teliyakunda pothundi , champadam enti ra babu … I’m very frustrated for doing this kind off buil shit , malli news lo repeat cheyadam , can’t understand people’s mentality, no one can change should people should have minimum common sense , what they are doing …😭

Leave a reply